వెస్టిండీస్ గడ్డపై వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. గయానా వేదికగా ఆదివారం అర్ధరాత్రి ముగిసిన రెండో టీ20 మ్యాచులో విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని8 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. నికోలస్ పూరన్(67; 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో జట్టు విజయానికి బాటలు వేశాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్(1) లు విఫలం కావడంతో 18 పరుగులకే టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (27) తో జత కలిసిన తిలక్ వర్మ(51; 41బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ నిలబట్టే బాధ్యతను తీసుకున్నారు. కానీ.. చివరి వరకూ ఉండి మెరుగైన స్కోరుని టీమ్‌కి అందించలేకపోయారు.