ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి కాకినాడ జీజీహెచ్ నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా చాగల్లు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో గంటికోట బాలకృష్ణను అరెస్టు చేశారు. గత నెల 17న రాజమహేంద్రవరం కేంద్రకారాగారానికి తరలించారు. ఇటీవల అతని ముక్కు నుంచి రక్తం కారడం, ఇతర అనారోగ్య కారణాలతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
అక్కడి మెడికల్ వార్డు ఎం-4లో చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి 9.30 గంటలకు కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో ఎస్కార్ట్‌గా ఉన్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు డి.నిరంజన్‌బాబు, జి.శ్రీహరిబాబు అతడిని బాత్రూంకి తీసుకు వెళ్లి బయట నిలబడ్డారు. ఆ మరుగుదొడ్డి కిటికీకి మెస్ బదులు అట్టముక్క ఉండటంతో దానిని తొలగించి అందులో నుంచి పరారయ్యాడు.
ఎప్పటికీ బయటకు రాకపోవడంతో వెళ్లి చూడగా పరారైనట్లు గుర్తించారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. అతడు 2021లో సైతం ఓ కేసులో ఖైదీగా ఉంటూ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఎస్కార్ట్ల కళ్లుగప్పి పరారయ్యాడు. అప్పుడు అతడి ఇంటి చిరునామాను కృష్ణా జిల్లా మైలవరంగా చెప్పాగా.., ప్రస్తుతం చిరునామా గుంటూరు టౌన్ అని ఉంది. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.