చూడ్డానికి ముచ్చటగా ఉన్నాడు… వదిలేయడానికి ఎవరికి చేతులు వచ్చాయో మరి. మాతృత్వపు మమకారం ఆస్వాదించడానికా అన్నట్లు కళ్లనిండుగా సంతోషం నింపుకొని రెప్పవేయకుండా చూస్తున్న ఆ పసికందు… తల్లి ప్రేమను ఎవరు దూరం చేస్తున్నారో మాయ కనిపెట్టలేకపోయాడు.
అమ్మ వెచ్చని పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు రేకుల షెడ్డులో కనిపించింది. ఆకలితో ఏడుస్తున్న ఆ మగ శిశువును మధ్యాహ్నం 12 గంటల వరకూ ఎవరూ గుర్తించలేదు. బిడ్డను ఎవరు అక్కడ వదిలేశారో తెలియని పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఈ ఘటన వెలుగు చూసింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనపర్తి పాతవూరులోని బాపనమ్మ ఆలయం ఏరియాలో మగశిశువును రేకుల షెడ్డులో వదిలేసినట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అనపర్తి గ్రామ సర్పంచి వారా కుమారి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. శిశువును వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు శిశువుకు చికిత్స చేసి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. పసికందు విషయమై ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చామని ఆసుపత్రి సూపరింటెండెంట్ రామగుర్రెడ్డి చెప్పారు. ఎవరి బిడ్డో విచారణ చేపడతామని అనపర్తి ఎస్సై అప్పారావు చెప్పారు.