కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి ముందు కీలక పరిణామం 4 నెలల తర్వాత పార్లమెంటుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత
ఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 7 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 4 నెలల తర్వాత మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని సోమవారం ఎత్తివేయడంతో ఆయన సభకు రావడానికి అడ్డంకి తొలగిపోయింది. ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఆయన పార్లమెంటుకు వచ్చారు. మార్చి 24న రాహుల్ గాంధీ సభ్యత్వంపై నిషేధం విధించారు.
పార్లమెంటుకు వచ్చిన రాహుల్ తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ‘ఇండియా’ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ‘రాహుల్ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8న చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభలోకి అడుగు పెట్టడంతో విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఒక రోజు ముందు రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టడం కీలక పరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు.