గూఢచార సంస్థకు కీలక సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానం సోషల్ మీడియాలో పరిచయమైన మహిళతో రహస్య చాటింగ్ కానిస్టేబుల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పంపించిన అధికారులు దర్యాప్తు చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు
పెదగంట్యాడ/విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 7: పాక్ గూఢచార సంస్థ విశాఖ కానిస్టేబుల్‌పై వల వేసింది. స్టీల్‌ప్లాంట్‌లోని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను హనీ ట్రాప్ చేయించింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువతితో కొన్నాళ్లగా సదరు కానిస్టేబుల్ రహస్య చాటింగ్ చేస్తుండడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి రంగంలోకి దిగారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ హనీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పడ్డాడు. తమీషా అనే మహిళతో కానిస్టేబుల్‌కు సోషల్ మీడియాలో పరిచయమైంది. ఈ క్రమంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. 2002నుంచి కపిల్ విశాఖ స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అంతకుముందు రక్షణ రంగంలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో కూడా కపిల్ పని చేశాడు. విశాఖ నుంచి కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార సంస్థకు చేరవేస్తున్నాడనే అనుమానంతో ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు తెలిసింది. ఇదే విషయమై అధికారులు స్టీల్‌ప్లాంట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రక్షణ రంగ అంశం కావడంతో విశాఖ పోలీసులు ఈ విషయమై నోరు మెదపడం లేదు. దర్యాప్తు చేస్తున్నట్టు మాత్రం ప్రకటించారు.