విద్యార్థుల మధ్య బాహాబాహీ రోడ్డుపై తన్నుకున్న యువకులు ఇతరుల రాకపై ప్రశ్నించిన సహచరులు కౌన్సెలింగ్ చేసిన ఎంవీపీ పోలీసులు
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 7: విశాఖలోని డాక్టర్ వీఎస్ కృష్ణా జూనియర్ కళాశాలలో సోమవారం యుద్ధాన్ని తలపించిన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులకు రోడ్లపైకి వచ్చి తన్నుకున్నారు. మరో వర్గం బయట నుంచి విద్యార్థుల్ని రప్పించడంతో వీరంతా బాహాబాహీకి దిగారు. విషయం పెద్దది కావడంతో ఎంవీపీ పోలీసులు రంగ ప్రవేశం చేసి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరికీ కౌన్సెలింగ్ చేశారు. ఇంటర్ తొలి సంవత్సరం చదువుకున్న ఓ విద్యార్థి యూనిఫారం లేకుండానే కళాశాలకు వచ్చాడు. దీంతో టీచర్ ఆయన్ను ప్రశ్నించారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని బయటకు పంపించేశాడు. అయితే తనను అకారణంగా కళాశాల నుంచి బయటకు వెళ్లగొట్టారనే బాధతో సదరు విద్యార్థి ఇతర ప్రాంతంలో ఉన్న తన స్నేహితుల్ని పిలిచి కళాశాలలో వీరంగం చేయించాడు. అనంతరం మరో వర్గం రంగంలోకి దిగి వారిని బయటకు వెళ్లెగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణతో పాటు సమీప వీధులన్నీ విద్యార్థుల వీరంగంతో నిండిపోయాయి. ఇతరుల రాకను కళాశాల విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కళాశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని విద్యార్థులు చెదరగొట్టారు. గొడవకు కారణమైన కొంతమంది విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో హెచ్చరించి పంపించేస్తామని, ఇప్పటికే కౌన్సెలింగ్ చేశామని పోలీసులు తెలిపారు.