మద్యం మత్తు… ఆపై అతివేగం… వెరసి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనతో ఎటువంటి సంబంధమూ లేని దంపతులు ప్రమాద స్థలిలోనే దుర్మరణం చెందడం చూపరులను కలిచివేసింది.
బీచ్‌రోడ్డులోని రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ద్వారకా జోన్ ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరానికి చెందిన ఐదుగురు యువకులు కారులో మద్యం సేవిస్తూ సాగరనగర్ నుంచి రుషికొండ వైపు వేగంగా వస్తున్నారు.
కారు రాడిసన్ బ్లూ హోటల్ సమీపానికి వచ్చే సరికి వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లిన కారు… అదే సమయంలో రుషికొండ నుంచి నగరంలోకి వెళ్తున్న దంపతుల బైక్‌ను… తర్వాత చెట్టును ఢీకొట్టింది. ఈ హఠాత్పరిణామంతో దంపతులు తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు.
కారులో వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు కూడా మృతి చెందాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న యువకుడితోపాటు ముందు కూర్చన్న మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతని స్నేహితులు కేజీహెచ్‌కు తరలించారు.