ఆఫీసు శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు పెచ్చులు ఊడి పడుతోంది. సాక్షాత్తూ అదనపు కలెక్టర్ వచ్చి కార్యాలయాన్ని తరలించాలని చెప్పినా.. పరిస్థితి మారలేదు. దీంతో చేసేదేమీ లేక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ హెల్మెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం 2016లో ఏర్పడింది. అప్పటి నుంచి ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థలో ఉండటంతో ఏడాది నుంచిపైకప్పు పెచ్చులు ఊడుతోంది. గత ఏడాది ఎంపీడీవో మల్లారెడ్డి కూర్చొని ఉండగా ఆయన టేబుల్‌పై పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో అప్పటి అదనపు కలెక్టర్.. ఎంపీడీవో కార్యాలయాన్ని తక్షణమే మార్చాలని ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు.
ఏడాదిలో రెండు సార్లు భవనం పైపెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. సోమవారం కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు హెల్మెట్లు ధరించి పనిచేశారు. హెల్మె ట్లు లేని వారు కార్యాలయం ఎదుట బయట టేబుళ్లు వేసుకొని విధులు నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న భవనం నుంచికార్యాలయాన్ని మరో చోటుకు మార్చాలని సమీపంలోని అంజన్న ఆలయంలో ఉద్యోగులు మొక్కుకున్నారు.