సింహాచలం, న్యూస్లీడర్, ఆగస్టు 8: భగవంతుడికి భక్తులు సమర్పించుకునే మొక్కులలో తలనీలాకి అగ్రతాంబూలం వేయకతప్పుదు. బాహ్య సౌందర్యం కోసం తపన పడే మానుషులు జట్టుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆడైనా.. మగైనా తమ జుట్టును చూసుకుని మురిసిపోతుంటారు. అంతటి ప్రియమైన జుట్టును మొక్కుబడిగా సమర్పించి భగవంతుడి పై తమకున్న విశ్వాసాన్ని ప్రకటించుకుంటారు భక్తులు. అటువంటి జుట్టుకు ఆధ్యాత్మికంగానే కాదు..ఆర్ధికంగా కూడా ఉన్న విలువ తెలిస్తే..ఆశ్చర్యపోతారు. వెంట్రుకేకదా అని తీసిపడేసే వాళ్ళంతా ప్రపంచ మార్కెట్లో జుట్టుకున్న విలువను తెలుసుకుంటే నోరెళ్ళబెట్టాల్సిందే..
సిరులు కురిపిస్తున్న కురుల విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
జుట్టు సేకరణ సాధారణంగా మూడురకాలుగా ఉంటుంది. అందులో మొదటిది మొక్కుబడులు రూపంలో దేవాలయాల ద్వారా వస్తుంది. తలనీలాలు సమర్పించడమన్న సంప్రదాయం హిందూ ఆలయాలలోనే కాదు కొన్ని ఇతర మతాల్లో కూడా ఉంది. ప్రధానంగా హిందూ దేవాలయాల్లో వచ్చే ఆదాయ మార్గాలలో తలనీలాలే ప్రధానం. భక్తులు మొక్కుల ద్వారా వస్తున్న జుట్టును దేవస్థానాలు వేలం పాటలు నిర్వహించి విక్రయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల ద్వారా ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది.
ఈనేపథ్యంలో ముందుగా మనం దక్షిణ భారతావనిలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో తలనీలాల వివరాలు పరిశీలిద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల తరువాత మొక్కుబడులుగా భక్తులు తలనీలాలు అధికంగా సమర్పించే ఆలయం సింహాచలమే. ఏడాదిలో సుమారుగా నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు అప్పన్నస్వామికి తలనీలాలు సమర్పిస్తారు. నెలల చిన్నారులు మొదలుకొని వయో వృద్ధుల వరకు మొక్కులు తీర్చుకుంటారు. ఒడిషా, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన మహిళల్లో అధిక సంఖ్యాకులు గుండు గీయించుకుని భగవంతుడి పట్ల అపారమైన భక్తిని చాటుకుంటారు. కొంత మంది కురులు మొక్కుబడిగా చెల్లిస్తారు. ఈ ఆలయంలో చైత్ర, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాలలో వచ్చే భక్తుల ద్వారా తలనీలాలు పెద్ద మొత్తంలో సమకూరుతాయి. ప్రతీ ఏటా ఈ నాలుగు నెలల్లోనే సుమారుగా రెండున్నర లక్షల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. ఇలా వచ్చిన తలనీలాలు అక్కడే ఏర్పాటు చేసిన హుండీల్లో వేస్తారు. వీటిని ఎప్పటి కప్పుడు కాంట్రాక్టర్లు సేకరించి గ్రేడిరగులకు పంపుతారు. జుట్టు నాణ్యతను బట్టి నాలుగు విభాగాలు చేస్తారు. పొడవాటి జుట్టును ప్రత్యేకంగాను మిగిలిన జుట్టును 1,2,3 మూడు కేటగిరులుగా వేరుచేస్తారు. ఇందులో ప్రత్యేక కేటగిరి జుట్టు కిలో సుమారు 26 వేల రూపాయలుగా కాంట్రాక్టర్లు ఈ ఏడాది వేలం పాడుకున్నారు. తూర్పు, పశ్చిమగోదావరి తో పాటు చెన్నై నుండి వ్యాపారులు వచ్చి వేలంలో పోటీపడతారు. ఒక్కొక్కసారి కాంట్రాక్టర్లు కుమ్మక్కై ధర పెరగకుండా చూస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యహరిస్తూ ఉంటారు. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది జుట్టు వేలం ద్వారా అప్పన్న ఖాజానాకి సుమారు 10 కోట్ల 80 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. కేశఖండనశాలలో ఐదుగురు పర్మినెంట్ ఉద్యోగులు, 63 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. రోజుకు 300 టిక్కెట్లు పర్మినెంట్ ఉద్యోగులకు తీసీవేయగా మిగిలిన టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కాంట్రాక్టు సిబ్బందికి పంచుతారు. ప్రభుత్వం తాజాగా తలనీలాల టిక్కెట్టు ధరను 25 నుండి 40 రూపాయలకు పెంచిన నేపథ్యంలో ఆ టిక్కెట్టు పై వచ్చిన ఆదాయాన్ని కాంట్రాక్టు సిబ్బందికి చెల్లిస్తారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి జుట్టు ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
అయితే దక్షిణ భారతీయుల తలనీలాలకు ప్రపంచ మార్కెట్లో అధిక గిరాకీ ఉంటుందట..! జుట్టు నల్లగా..పొడవుగా ఉండడమే ఇందుకు కారణమట.! విగ్గుల తయారీలో ఈజుట్టునే అధికంగా వినియోగిస్తారట.! జుట్టు సేకరణ లో అగ్రభాగం ఆలయాల ద్వారానే అయినా మరో రెండు మార్గాల్లో కూడా జుట్టు సేకరణ జరుగుతూ ఉంటుంది. సెలూన్లూ, బ్యూటీ పార్లర్ల తో పాటు వీధుల్లోకి వచ్చి జుట్టును వివిధ రూపాల్లో కొనుగోలు చేసేవారినీ మనం చూస్తున్నాం. ఇలా సేకరించిన జుట్టు బడా వ్యాపారులకు చేరుతోంది. ఇక వీటి రవాణాలో ఉన్న రహస్యాలను లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి.