` ప్రతిభావంతురాలైన పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం
రాజమహేంద్రవరం, న్యూస్‌లీడర్, ఆగస్టు 8 : ప్రతిభావంతురాలైన పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వరద నష్టం బాధితులను పరామర్శించడానికి గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని పాలకొల్లుకు చెందిన విద్యార్థి జాహ్నవి దంగేటి తల్లిదండ్రులతో కలిశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం చేయాలని కోరారు. భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు వివరించింది. దీంతో జాహ్నవిని సీఎం అభినందించారు. తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు.
కాగా, గత ఏడాది జూలైలో రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంలో సీఎం జగన్‌ను కలిసిన జాహ్నవికి ఉన్నత చదువుకు ఆర్థిక సహాయాన్ని అర్థించింది. దీంతో ముఖ్యమంత్రి ఏవియేషన్ శిక్షణకు ఆమెకు రూ.50 లక్షల సాయం అందించారు. అప్పుడు ప్రభుత్వం అందించిన సహకారంతో ఉన్నత చదువులు చదివిన ఆమె నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా.. సీఎం జగన్‌ను కలిసిన జాహ్నవి అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. ఆమె అభ్యర్థనకు సీఎం సానుకూలంగా స్పందించారు. గతంలో మీరు అందించిన ఆర్థిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్ ఫ్లోరిడా, యూఎస్ఏ నుంచి సైంటిస్ట్ వ్యోమగామిగా సిల్వర్ వింగ్స్ అందుకున్నారని సీఎంకు సమాచార శాఖ మంత్రి వేణుగోపాల్ వివరించారు.