ఆ యువతి పిజ్జా సరదా.. ఆమె ప్రియుడి ప్రాణాలు పోయేందుకు దారి తీసింది. బేకరీలోనే పనిచేస్తున్న అతడు, ఆమె అడిగిందే తడవుగా పిజ్జాను చేయించి ఇంటి వద్ద వాలిపోయాడు. ఇద్దరూ కలిసి ఆమె అపార్టుమెంటుపైకి వెళ్లి చల్లగాలిలో పిజ్జా తింటూ ముచ్చటిస్తున్నారు. ఇంతలో కూతురిని వెతుక్కుంటూ ఆమె తండ్రి పైకి వచ్చారు.
ఒక్కసారిగా ఆయన్ను చూసిన యువకుడు బిక్కచచ్చిపోయాడు. ఏమీ పాలుపోలేదు. ఆ కంగారులో వారు ఉన్న ఆ నాలుగవ అంతస్థు పైనుంచి కిందకు దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
బోరబండ పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బోరబండవాసి మహ్మద్ షోయబ్(19)గా గుర్తించామని, అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.