విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వ్యక్తి.. లైంగికంగా వేధిస్తూ వారిపట్ల కీచకుడిలా తయారయ్యాడు. అతడి అసభ్య ప్రవర్తనకు విసిగిపోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
విజయనగరం జిల్లా వంగర మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌ఛార్జి ఎస్ఐ బి.లోకేశ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. వంగర జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బండి రాముడు ఏడాదిగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఫొటోలు తీసుకొని.. వాట్సప్‌లో స్టేటస్ పెట్టాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. వారంతా బంధువులతో కలిసి పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయురాలు ముద్దాడ రమణమ్మకు ఫిర్యాదు చేశారు.
అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. రెండ్రోజుల క్రితం సంగాం గ్రామానికి చెందిన విద్యార్థినుల బంధువులు కూడా ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి, నిందితుడిని రాజాం తరలించామని.. సీఐ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని ఇన్‌ఛార్జి ఎస్ఐ చెప్పారు. వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఉపాధ్యాయుడు బండి రాముడును జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు రమణమ్మ తెలిపారు.