` ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై దృష్టి పెట్టండి ` ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, న్యూస్లీడర్, ఆగస్టు 8 : ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై రాజకీయ ఒత్తిడిలు ఎక్కువయ్యాయని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా పరిస్థితి తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం వేడుక చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమను రాజకీయాలు చుట్టుముడుతున్నాయన్నారు. మీరు పోరాడేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి కల్పన.. ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించండి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడతారేంటి? అంటూ చురకలు అంటించారు. వాల్తేరు వీరయ్య విజయోత్సవం చాలా ఆనందం కలిగించిందన్నారు.