రుషికొండ కారు ప్రమాదంలో తేలని ఆచూకీ
కారులో ఉన్న ముగ్గురి పరారీ
వాహనంలో భారీగా మద్యం సీసాలు
వైన్‌షాపుల వద్దే డ్రంకెన్ డ్రైవ్..పబ్‌ల వద్ద ఏదీ పహారా?
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 8: విశాఖ-భీమిలి మార్గంలో సోమవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన యువతి ఆచూకీపై పోలీసులు ఇప్పటికీ ఆరా తీస్తున్నారు. సాగర్‌నగర్ నుంచి ఎండాడ వైపు వెళ్తున్న ఓ కారు సరిగ్గా రాడిసన్ హోటల్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి ముగ్గురు మృతికి కారణమైన విషయం తెలిసిందే. అయితే కారులో ఉన్న ఆరుగురిలో ఎం. మణికుమార్ (25) అనే యువకుడితో పాటు ద్విచక్ర వాహనంపై అటుగా వస్తున్న పృథ్విరాజ్ (28), ప్రియాంక (21) అనే వారు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే తొలుత పృథ్విరాజ్, ప్రియాంకను అందరూ భార్యభర్తలుగా భావించారు. పోలీసులు కూడా మృతి చెందిన వారు భార్యభర్తలతో పాటు మరో యువకుడి మృతి అంటూనే ప్రాథమికంగా తేల్చారు. తీరా మంగళవారం పృథ్విరాజ్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాల్ని చూసి యువతి విషయం మాత్రం తమకు తెలియదని చెప్పడంతో ఇప్పుడా మహిళ ఎవరు? ప్రేమికులా..మరేదైనా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఆమె వివరాలు తెలియకపోవడంతో సీసీ ఫుటేజీ, వాహనం నంబర్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదంలో భాగంగా డివైడర్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టును ఢీకొని అవతలి వైపునకు కారు దూసుకుపోయింది. ఆ కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం అనంతరం ముగ్గురు యువకులు పరారైపోయారు. అంతే కాకుండా కారులో ఉన్న వారంతా పూటుగా మద్యం సేవించి ఉన్నారని, వాహనంలో భారీగా మద్యం సీసాలున్నట్టు పోలీసులు గుర్తించారు. పూటుగా మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విషయం స్పష్టమైంది. ఇదిలా ఉంటే కారులో వెనుక సీట్లో కూర్చున్న మణికుమార్ తీవ్రంగా గాయపడి కారులోనే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు తొలుత బీచ్ పెట్రోలింగ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సీఎం త్రివక్రవమ్ వర్మ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు.
పబ్‌ల వద్ద కనబడని డ్రంకెన్ డ్రైవ్
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిత్యం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నా అది వైన్‌షాపులు, బార్ల వరకే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. రుషికొండ ప్రాంతంలో చాలా వరకు పబ్‌లున్నాయి. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదం కూడా మద్యం సేవించి వాహనం నడపడం వల్లేనని తేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద పహారా కరువైందంటున్నారు. ఇటీవల వీఐపీ రోడ్డులో కూడా ఓ కారు భీభత్సం సృష్టించి, ఆరు ద్విచక్ర వాహనాల్ని ధ్వంసం చేసేసింది. ఆ ప్రమాదానికి కారణం కూడా ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కారు నడపడం వల్లేనని పోలీసులే తేల్చారు. మరో విషయం ఏంటంటే ద్విచక్ర వాహనదారులకే డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని, కార్లపై మాత్రం పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. అలా చేస్తే కచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కావని వాహనదారులే చెబుతున్నారు. వాహనాల్లో మద్యం బాటిళ్లు పట్టుకు తిరుగుతున్నారంటే యువత ఎంతగా వహిస్తోందో చెప్పవచ్చు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో కారు ప్రమాదాలు కూడా అధికమయ్యాయి. అందుకే డ్రంకెన్ డ్రైవ్ కేసుల్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే ఇంకెన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో.