ఆటకు వయసుతో సంబంధం లేదని స్కాట్లాండ్ మాజీ ప్లేయర్, 83 ఏళ్ల అలెక్స్ స్టీలీ నిరూపించాడు. మూడేళ్లుగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నా.. ఆక్సిజన్ సిలెండర్ పెట్టుకొని మరీ వికెట్ల వెనుక అతను కీపింగ్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
1967లో ఫోర్ఫర్షైర్ క్లబ్ తరఫున కౌంటీల్లో అరంగేట్రం చేసిన అలెక్స్ వయసు మీదపడినా.. ఉత్సాహం తగ్గకుండా ఆడుతున్నాడు. ఇటీవలే అతడు ఆక్సిజన్ సిలెండర్ పెట్టుకొని మ్యాచ్ ఆడుతున్న వీడియో నెట్లో వైరల్ అయింది.
1960ల్లో స్కాట్లాండ్ క్రికెట్ జట్టులో సభ్యుడైన స్టీలీ 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. కాగా, అతడికి ప్రాణవాయువు సిలెండర్ నుంచి కాదు.. క్రికెట్ నుంచి అందుతోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.