. ఇటీవల తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘటనపై అందిన ఫిర్యాదు
కురబలకోట, న్యూస్‌లీడర్, ఆగస్టు 9 : ఇటీవల అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబుతో పాటు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు. వీరితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇతరులంటూ మరికొందరు టీడీపీ నేతలపైనా కేసు నమోదు చేశారు.
ములకలచెరువులోనూ కేసు..
మరోవైపు ములకలచెరువు పీఎస్‌లోనూ చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు షోలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్త చాంద్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ7గా పేర్కొన్నారు.