వైద్యుల విధి నిర్వహణలో సేవాలోపం ఉందంటూ ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా ఫోరం తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది మెట్ట మహేందర్ కథనం మేరకు.. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన మహిళ(50) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతుండేవారు.
ఆమె 2010 సెప్టెంబరు 1న కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆమెకు ‘హెచ్ఐవీ పాజిటివ్’ అని నివేదిక ఇచ్చి.. 5 రోజులపాటు చికిత్స అందించి పంపించారు. అదే నెల 6న ఆమె జగిత్యాల ఏరియా ఆసుపత్రిలోని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో సంప్రదించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి.. హెచ్ఐవీ లేదని వైద్యులు నిర్ధారించారు.
దీంతో ఆమె కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఫోరం సంబంధిత ఆసుపత్రి వర్గాలకు నోటీసు జారీచేయగా వారు తమవద్ద ఎలాంటి లోపం జరగలేదన్నారు. ఇరువర్గాల సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ఫోరం.. వైద్యుల విధి నిర్వహణలో లోపం ఉందని తేల్చింది. ఆ మహిళకు రూ.2 లక్షలు 2011 నవంబరు 22 (ఫిర్యాదు దాఖలు అయిన తేదీ) నుంచి 9% వడ్డీతోను, ఖర్చుల కింద రూ.5 వేలు 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు చెప్పింది.