` హంగూఆర్భాటాలు లేకుండా కార్యాలయ సిబ్బంది సమక్షంలో రిజిష్టర్ మ్యారేజ్
మచిలీపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 9 : కృష్ణా జిల్లా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ (జేసీ) డా.అపరాజిత సింగ్ సిన్వర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన అపరాజిత సింగ్.. అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్రకుమార్‌ను వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో అపరాజిత, దేవేంద్రకుమార్ పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. యూపీ క్యాడర్‌కు చెందిన దేవేంద్రకుమార్.. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.