ఒకరినొకరు ఇష్టపడ్డారు.. నూరేళ్లు కలిసి జీవించాలని పట్టుపట్టి పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.. ఆరునెలలపాటు సంతోషంగానే జీవించారు. ఇంతలోనే ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒకరి తరువాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదట భార్య రమాదేవి సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే ముందు భర్త మంజునాథతో చరవాణిలో ప్రేమగా మాట్లాడింది.
మరుసటి రోజు తెల్లవారు జామునే మంజునాథ్ కూడా రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. రైల్వే పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన బాలపుల్లయ్య, ఓబుళమ్మ దంపతుల కుమారుడు మంజునాథ్‌కు (27) పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, లక్ష్మీదేవిల కుమార్తె రమాదేవి (24)లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది.
మంజునాథ్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. సోమవారం సాయంత్రం పట్టణ పరిసరాల్లోని చల్లవారిపల్లి గ్రామ సమీపంలో రైలు కిందపడి రమాదేవి మృతి చెందింది. మంజునాథ్, కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని రమాదేవి తల్లిదండ్రులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి భార్య రమాదేవి మరణించిందన్న కబురు విన్న తరువాత రెండుసార్లు రైలు కిందపడేందుకు మంజునాథ్ వెళ్లగా కుటుంబ సభ్యులు అడ్డుపడి ఇంటికి తీసుకొచ్చారు.
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా.. మంజునాథ్ తాడిపత్రి రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువ దంపతులు ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడటంతో చిన్నపొలమడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇద్దరి బలన్మరణాలకు కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.