అభం శుభం తెలియని చిన్నారి కారు టైరు కింద నలిగి ప్రాణాలొదిలాడు. ఆగ్రహం చెందిన కుటుంబసభ్యులు కారు యజమాని ఇంటి ముందు గొయ్యి తవ్వి మృతదేహాన్ని ఖననం చేసే ప్రయత్నం చేశారు. పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన దస్తగిరి, నజ్మూన్ దంపతులు మూడేళ్ల క్రితం అనంతపురం నగరానికి వలస వచ్చారు.
శివారులోని రుద్రంపేట పంచాయతీ చంద్రబాబుకొట్టాలలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. దస్తగిరి ఏటీఎం నగదు లోడింగ్ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వారికి ఆసీఫ్ (13 నెలలు), మూడేళ్ల హఫీజా ఉన్నారు. ఆసీఫ్ ఇంటి బయట ఇసుకలో ఆడుకుంటుండగా రాజగోపాల్‌కు చెందిన కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కారు యజమాని కనీసం పరామర్శించడానికి రాలేదనే కోపంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో అతని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇంటి గడప ముందు గొయ్యి తవ్వి చిన్నారి మృతదేహాన్ని ఖననం చేయడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ సీఐ వెంకటేష్‌నాయక్, నాల్గో పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులు, బాధిత కుటుంబసభ్యులతో చర్చించారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.