కోల్‌కతా, న్యూస్‌లీడర్, ఆగస్టు 10 : దేశంలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం అయిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. 2023 ప్రపంచకప్ కోసం మరమ్మతు పనులు చేస్తుండగా.. బుధవారం రాత్రి డ్రెస్సింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. దీంతో వారు రెండు ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. విద్యుత్తు పరికరాల్లో సమస్య కారణంగా ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట ఎటువంటి సీసీ కెమెరాలు లేవు.డ్రెస్సింగ్ రూమ్‌లోని ఫాల్‌సీలింగ్‌లో ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. క్రికెటర్లు సాధారణంగా తమ సామగ్రిని భద్రపర్చుకోవడానికి ఈ గదిని వాడుతుంటారు. అగ్ని ప్రమాదం వార్త తెలియగానే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ దేబ్రత్దాస్ మైదానానికి చేరుకొన్నారు. ఈ ఘటనలో స్వల్ప నష్టంతో బయటపడ్డామని సిబ్బంది చెబుతున్నారు. కాకపోతే, ఆటగాళ్లకు చెందిన కొంత సామగ్రి మాత్రం కాలిపోయినట్లు సమాచారం. ప్రపంచకప్ మరో రెండు నెలలు ఉందనగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ మైదానంలో ఫైర్ సేఫ్టీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ జరగాలంటే అగ్నిమాపకశాఖ అనుమతులు తప్పనిసరి. మరో వైపు ఆటగాళ్ల కోసం ఇక్కడ మరో కొత్త డ్రెస్సింగ్ రూమ్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది.
హఠాత్తుగా మంటలు వ్యాపించడానికి గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రపంచ కప్ కోసం మైదానంలో చాలా వేగంగా మరమ్మతు పనులు చేపట్టారు. సెప్టెంబర్ 15 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా విధించడంతో రేయింబవళ్లు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులపై ఐసీసీ ప్రతినిధులు ఇప్పటికే సంతృప్తి వ్యక్తం చేశారు. వారు వచ్చే నెల మరోసారి ఈ మైదానాన్ని తనిఖీ చేయనున్నారు.