తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందేభారత్ రైలులోని ఒక బోగీలో పొగలు వ్యాపించడంతో ప్రయణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై మనుబోలు రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది.
రైలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలోకి రాగానే మూడో బోగీలో ఒక్కసారిగా స్వల్పంగా మంటలు లేచి, దట్టమైన పొగలు వ్యాపించాయి. సిబ్బంది గమనించి వెంటనే లోకో పైలట్‌కు సమాచారం ఇవ్వగా.. రైలును ఆపేందుకు అకస్మాత్తుగా బ్రేకులు వేశారు. ఈ ధాటికి బ్రేకు డ్రమ్ములు పట్టేసి మరోసారి పొగ వ్యాపించింది. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆగి ఆగగానే కొందరు రైల్లోంచి దిగేశారు.
మరుగుదొడ్డిలో తాగి పడేసిన సిగరెట్ వల్లే పొగ వ్యాపించినట్లు సిబ్బంది గుర్తించారు. సిగరెట్ వేశారనే అనుమానంతో ఒకరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో మనుబోలు స్టేషన్లో అరగంటకుపైగా రైలు ఆగింది.