` రెపోరేటు 6.5 శాతం
` ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
` ద్రవోల్బణం పెరుగుదలపై ఆందోళన
` రుణ గ్రహీతలకు తప్పిన భారం
ముంబై, న్యూస్లీడర్, ఆగస్టు 10 : ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.
గత జూన్ సమావేశంలోనూ రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడోసారి. అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టే ఉద్దేశంతో 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచింది.
ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ.. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి కమిటీ నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఎంపీసీ దృష్టి సారించిందని, అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యిత పరిధి అయిన 4 శాతం ఎగువగానే ఉందని తెలిపారు.
కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగి 4.81శాతంగా నమోదైంది.
వృద్ధి రేటు 6.5శాతం..
ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గత అంచనాలను అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు దాస్ తెలిపారు. వాణిజ్య రంగంలో వనరుల ప్రవాహం గతేడాది రూ.5.7 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రూ.7.5 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగేందుకు ప్రగతిపథంలోనే నడుస్తోందని ఆర్బీఐ గవర్నర్ వెల్లడిరచారు.
ద్రవ్యోల్బణ అంచనాలు..
బియ్యం, టమాటాలు, పప్పుధాన్యాలతో పాటు ఇతర వస్తువుల ధరలు విపరీతరంగా పెరగడంతో ఈ ఏడాది రిటైల్ ద్రవ్యల్బోణ అంచనాలను ఆర్బీఐ సవరించింది. గతంలో ఈ అంచనాలు 5.1 శాతంగా ఉండగా.., ఇప్పుడు దాన్ని 5.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతం, మూడో త్రైమాసికంలో 5.7శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండనున్నట్లు అంచనా వేసింది.