.2018 నుంచి ఇప్పటి వరకు వసూలు
. ఏటీఎం సేవల కోసం రూ.8 వేల కోట్లు
. ఎస్సెమ్మెస్ సేవలు రూపేణా రూ.6 వేల కోట్లు
. వివరాలను వెల్లడిరచిన కేంద్రం
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 10 : ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. దీంతో పాటు ఏటీఎం లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐదు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము వివరాలను వెల్లడిరచింది. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.35,000 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు అందులో తెలిపింది.
ప్రభుత్వ బ్యాంకులతో పాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ , ఐడీబీఐ బ్యాంకు ల నుంచి కనీస బ్యాలెన్స్ ఉంచని కారణంగా రూ.21,000 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,000 కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6,000 కోట్లు వసూలు చేసినట్లు అందులో తెలిపింది. కొన్ని రకాల ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే వాటిపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఈ ఛార్జీలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. కాగా, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాల్లో, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు.
నిబంధనల మేరకు.. నెలవారీ సగటు బ్యాలెన్స్ మెట్రో నగరాల్లో రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. చిన్న నగరాల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. ఈ ఛార్జీలు బ్యాంకుల బట్టి మారుతూ ఉంటాయి.