రేటింగ్: 3/5
తారాగణం:
రజనీకాంత్, రమ్యకృష్ణ, నాగబాబు, సునీల్, జాకీష్రాఫ్, మోహన్ లాల్, సివ రాజ్ కుమార్, తమన్నా, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి, యోగిబాబు, జఫ్ఫెర్ సాధిక్, రెడిన్ కింగ్స్లెయ్.
కథా విషయానికి వస్తే:
ముత్తువేల్ (రజనీ) తన కుటుంబంతో – భార్య (రమ్యకృష్ణ), కొడుకు (వసంత్ రవి), కోడలు (మిర్నా మీనన్) మనవడితో రిటైర్ద్ జైలర్ గా జీవితం గడుపుతుండగా సినిమా ఆరంభం.
గుళ్లో విగ్రహాలను కాజేసి విదేశాలకు అమ్ముకునే వర్ణ (వినాయకన్) ముఠా నాయకుడ్ని పట్టుకునేందుకు జైలర్ కొడుకు ఏసిపి పరిశోధిస్తున్న సమయంలో విలన్ గ్యాంగ్ చేతిలో బలవుతాడు. కొడుకు కనిపించడం లేదు అన్న విషయం తెలుసుకుని జైలర్ తనే రంగ ప్రవేశం చేసి విలన్ గ్యాంగును పట్టుకోవడానికి అవసరమైన సమయంలో తన స్నేహితుల సహాయం తీసుకుని విలన్ గ్యాంగ్ ను మట్టుపెడతాడు. ఇదే స్టోరీలైన్.
కుటుంబంతో సహా కలిసి చూసేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమర్ సినిమాను తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. పాత్రల పరంగా చెప్పుకోవాల్సి వస్తే రజనీ నట విశ్వరూపం నరసిం హ, రోబో సినిమాల తరువాత ఈ సినిమా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో జైలర్ గా రజనీ నటన ఆయన పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఆయన వయసుకు తగ్గ పాత్ర చేసి అభిమానులను రంజింప చేశారు. ఆ విషయంలో దర్శకుడు కూడా శ్రద్ధ తీసుకున్నాడు. కధలో హీరోకు అవసరమైన సమయంలో సహాయం చేసే పాత్రలను కూడా కధకు అనుగుణంగా పరిచయం చేసిన విధానం బాగుంది. వారిలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, హిందీ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ మెరిశారు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా అందుకున్నారు. తమన్నా ఒక పాటలో తన నృత్యంతో అలరించింది, కొన్ని సన్నివేశాలలో హాస్యం సునీల్ తదితరులతో. సినిమా సన్నివేశాలలో అంతర్లీనంగా యోగిబాబు తో సాగే కామెడీ పర్వాలేదు. నాగబాబు, ఇతర సహాయ నటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మానసిక రోగిగా వైద్యశాలలో హీరో చేరినపుడు డాక్టర్‌తో సంభాషణలు బాగున్నాయి. మాటల రచయిత బాగానే వ్రాశారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై టెక్నికల్ గా ఈ సినిమాను చాలా స్టైలిష్‌గా, రిచ్‌గా కమర్షియల్ హంగులతో తీశారు. అనిరుధ్ సంగీతం సినిమాకు హైలెట్. ఇంటెర్వెల్ సీన్స్ తో ప్రథమార్ధం ఆకట్టుకుంది. ద్వితీయార్ధంలో దర్శకుడు కొంత తడబడినా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లతో సరిదిద్దుకుని సినిమా చూసిన సగటు ప్రేక్షకుడితో బాగుంది అనే భావన తీసుకురావడంలో సఫలీకృతుడయ్యాడు. దేశవ్యాప్తంగా మరీ ప్రత్యేకంగా దక్షిణాదిలో రజనీ అభిమానులనుకు ఈ సినిమా పండగే. మిగిలిన ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
రివ్యూ: సినిమా చూసిన ప్రేక్షకుడిగా నా అభిప్రాయం మాత్రమే.