ప్రేమ పేరుతో బాలికను వలలో వేసుకుని ఆమె గర్భం దాల్చాక పరారైన యువకుడిపై రాజమహేంద్రవరం ఒకటో పట్టణ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ మహిళ భర్త మరణించడంతో రోడ్డు పక్కన పూలు, పళ్లు అమ్ముకుంటూ కుమార్తె (17)తో కలిసి ఉంటోంది. కుమార్తెకు కొంచెం మతి స్థిమితం లేకపోవడంతో పాఠశాలకు పంపడంలేదు.
వ్యాపార నిమిత్తం తల్లి బయటకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండేది. వారు నివసించే వీధిలోకి తరచూ లంకల బాబీ అనే యువకుడు చేపల విక్రయానికి వచ్చేవాడు. ఒంటరిగా ఉంటున్న బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండుతున్న సమయంలో విషయం తల్లికి తెలిసింది.
బాబీని నిలదీయాలని ఆమె ప్రయత్నించినా అప్పటికే అతడు అదృశ్యమయ్యాడు. ఇటీవల ఆ బాలిక స్నానాల గదిలో ప్రసవించి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. చికిత్స పొందుతూ కాకినాడలో బిడ్డ మృతి చెందింది. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో, అత్యాచారం కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.