మలక్‌పేట పోలీస్ ఠాణా ఆవరణలో శరీరంపై పెట్రోల్ చల్లుకుని.. నిప్పంటించుకుని గాయాలతో చికిత్స పొందుతున్న సోలంకి విజయ్ (24) బుధవారం మృతి చెందాడు. మలక్‌పేట పోలీసులు, విజయ్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మూసారాంబాగ్ డివిజన్ తీగలగూడలో విజయ్.. భార్య విజయ భవాని, ఆరేళ్ల కుమారుడు, మరో దత్తత కుమారుడితో నివసిస్తున్నారు.
భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. గత నవంబరులో గంజాయి మత్తులో మిత్రుడు ఆస్మాన్‌గఢ్‌కు చెందిన షేక్ ఫారూఖ్ (26)ను విజయ్ కత్తితో పొడిచాడు. ఈ కేసులో 3 నెలలు జైలులో ఉండి ఇటీవల బయటకు వచ్చాడు. ఫారూఖ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని మలక్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు స్పందించడం లేదంటూ.. భార్య, పిల్లలతో ఠాణాకు వచ్చి పెట్రోల్‌ను చల్లుకుని నిప్పంటించుకోగా పోలీసులు ఉస్మానియాకు తరలించారు.
విజయ్ మీద మలక్‌పేట ఠాణాలో రెండు, చైతన్యపురి ఠాణాలో నాలుగు, ఎల్బీనగర్ ఠాణాలో ఒక కేసు ఉన్నాయి. దొంగతనాలు, కొట్లాటలకు సంబంధించిన కేసులు ఇవి. విజయ్ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసును నమోదు చేసినప్పటికీ ఫారూఖ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండటంతో తొలుత అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు. ఈనెల 2న అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్ తెలిపారు.