పార్టీ ఆశయాలు అర్ధం చేసుకుని
వచ్చిన వారిని పార్టీ ఆహ్వానిస్తోంది: పవన్ కళ్యాణ్
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 10: జనసేన ఆశయాలు అర్ధం చేసుకుని వచ్చిన వారిని తమ పార్టీ ఆహ్వానిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీలో చేరారు. నగరంలోని దసపల్లా హోటల్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో విజయనగరం జిల్లా ఇంచార్జి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో గజపతినగరం ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ, మరో 12 మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో వారాహి యాత్ర 3వ విడత ప్రారంభిస్తున్నామని తెలిపారు. పదవి ఆశించకుండా అరుణ ప్రత్యేకంగా పార్టీ లో చేరారని, ఉమ్మడి రాష్ట్రంలో అరుణ ఆనాడు పదవిలో ఉన్నపుడు పోరాట పటిమ చూపించారని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం జనసేన పార్టీ అభివృద్ధికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన పడాల అరుణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం అని భావించి జనసేన పార్టీలో చేరానని తెలిపారు. యువతకు మేలు చేసే పవన్ ఆలోచనలు, నిర్ణయాలు తనకు నచ్చాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్యనారాయణ ,తమ్మిరెడ్డి శివశంకర్, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ పంచకర్ల సందీప్ ,పంచకర్ల రమేష్ బాబు, ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ పసుపులేటి ఉసాకిరణ్ చోడవరం ఇంచార్జ్ పివీఎస్ఎన్ రాజు, పాడేరు ఇంచార్జి వంపులూరి గంగులయ్య, కార్పొరేటర్లు బిశెట్టి వసంత లక్ష్మి, కందుల నాగరాజు ,దల్లి గోవింద రెడ్డి, మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి మూగి శ్రీనివాసరావు, పీఏసీ సభ్యులు కోన తాతారావు, డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, అనకాపల్లి ఇంచార్జ్ పరుచూరి భాస్కర్ రావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.