విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 11: విశాఖ పెద్దాస్పత్రిలో శుక్రవారం ఉదయం ఒక శిశువు మృతి చెందింది. వైద్యులు కనీసం పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రోజుల వయస్సున్న పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పాలకొండకు చెందిన ఎం.శిరీష్, చంద్రశేఖర్ దంపతులకు వారం రోజుల క్రింత పాప జన్మించింది. జీర్ణశక్తి సమస్య తలెత్తడంతో కేజీహెచ్‌కు తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సిఫారుసు చేశారు. గత శనివారం రాజేంద్రప్రసాద్ దరి పిల్లల వార్డులో చేర్పించగా మంగళవారం పేగుకు శస్త్రచికిత్స జరిపారు. అయితే ఆ తర్వాత అత్యవసర వార్డులో శిశువును పెట్టినా వైద్యులే లేరని, పర్యవేక్షణ శూన్యమని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పాప పరిస్థితి రోజుకోలా చెప్పారని, పచ్చకామెర్లంటూ తమ సంతకాలు తీసుకున్న తర్వాత శిశువు మృతిచెందినట్టు చెప్పారని ఆరోపించారు. గతంలో బాబు పుట్టగా ఆయన కూడా కేజీహెచ్‌లోనే మృతిచెందాడని గుర్తు చేశారు. సుదూరాల నుంచి వస్తున్న బాలింతలు, గర్భిణులు చెట్లకింద, గట్లమీదే ఉండిపోతున్నారని, సిబ్బందిని ప్రశ్నిస్తున్నా తమకేమీ తెలియదంటూ తప్పించుకుంటున్నారని, తమకు జరిగిన ఘోరం ఇంకెవరికీ జరగకూడదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. రాత్రి నుంచి వేచి చూస్తున్నా కనీసం ఒక్క డాక్టరైనా రాలేదని, పిల్లల్ని చంపేయడానికే ఇక్కడి సిబ్బంది ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.