ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేర్ వీరయ్య’తో మరోసారి తన మాస్ స్టామినాను చూపించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ‘భోళా శంకర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వేదాళం’ రీమేక్‌గా మెహర్ రమేశ్ దీన్ని తీర్చిదిద్దారు. తమిళంలో అజిత్ కథానాయకుడిగా నటించిన ‘వేదాళం’ ప్రేక్షకుల ముందుకొచ్చి దాదాపు ఎనిమిదేళ్లవుతోంది. అలాంటి ఓ పాత కథని ఎంచుకుని, అంతకు మించిన పాత పద్ధతులతో తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో అదే… ‘భోళాశంకర్’. రీమేక్ అంటేనే చాలామంది సినీ ప్రేమికులకి తెలిసిపోయిన కథ. అలాంటి ఓ కథకి… కథనం, భావోద్వేగాలు, హీరోయిజంపరంగా ఏమాత్రం కొత్త జోడిరపులు లేకుండా, మేకింగ్‌లోనూ ఎక్కడా కొత్తదనం లేకుండా తెరకెక్కిస్తే అది ప్రేక్షకులకి ఎలాంటి అనుభవాన్నిస్తుందో ఊహించుకోవచ్చు.
తొలి భాగం మొత్తం కలకత్తా నేపథ్యంలోనే సాగుతుంది. టాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి – టాక్సీ కంపెనీ ఓనర్‌గా కనిపించే వెన్నెల కిశోర్ మధ్య ట్రాక్‌తో కామెడీ పండిరచాలని ప్రయత్నించినా బెడిసికొట్టింది. లాయర్ లాస్య పాత్రలో తమన్నాకీ, చిరంజీవికీ మధ్య సన్నివేశాల్లోనూ పస లేదు. పోరాట ఘట్టాలు, పాటలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ, అవి ప్రేక్షకులపై ఏమాత్రం ప్రభావం చూపించవు. ఒక్క సన్నివేశంలోనూ సహజత్వం కనిపించదు. విరామంలో ఓ మలుపు చోటు చేసుకున్నా అప్పటిదాకా సాగిన బోరింగ్ డ్రామా ప్రభావంతో ఆ సన్నివేశాలు ఏమాత్రం ప్రభావం చూపించవు. అయితే ద్వితీయార్ధం ఆరంభమయ్యాక ప్రథమార్ధంతో పోలిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది.
ఫ్లాష్‌బ్యాక్‌లో భాగంగా గ్యాంగ్‌స్టర్ బోలాగా చిరంజీవి కనిపించిన విధానం, ఆయన తనదైన శైలిలో పండిరచిన హాస్యం అక్కడక్కడా మెప్పిస్తుంది. కీర్తి ఇంట్లో శ్రీముఖి, మురళీశర్మ, గెటప్ శ్రీను, తాగుబోత రమేశ్, బిత్తిరి సత్తి తదితర గ్యాంగ్‌తో కలిసి చిరంజీవి చేసిన సన్నివేశాలు కొన్ని నవ్విస్తాయి. అయితే పవన్‌కల్యాణ్‌ని అనుకరించడం, ముఖ్యంగా శ్రీముఖితో కలిసి చేసిన ‘ఖుషి’ నడుము సన్నివేశాలు నవ్వించలేకపోయాయి. అలాంటి ప్రయత్నాలకి చిరంజీవి దూరంగా ఉండటం మంచిది. ఆయన కాస్త స్టైలిష్‌గా, హుషారుగా కనిపించడం ఒక్కటే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం. అన్నాచెల్లెళ్ల బంధం, మహిళల అక్రమ రవాణా కథకి కీలకం అయినప్పుడు ఆ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు పండాలి. చిరంజీవిలాంటి ఓ స్టార్ కథానాయకుడు ఉన్నా ఆ నేపథ్యంలో మనసుల్ని తాకే ఒక్క సన్నివేశం కానీ సంభాషణ కానీ లేదు. పతాక సన్నివేశాలు కూడా ఊహకు తగ్గట్టే సాగుతాయి. మెహర్ రమేశ్ నుంచి దాదాపు పదేళ్ల తర్వాత వచ్చిన సినిమా ఇది. కావల్సినంత సమయం దొరికినా రచన, మేకింగ్ పరంగా ఏమాత్రం కొత్త రకమైన కసరత్తులు చేయలేదన్న విషయం ఈ సినిమా స్పష్టం చేస్తుంది.
చిరంజీవి తనదైన మాస్ మార్క్‌తో తెరపై కనిపించారు. పాటలు, పోరాట ఘట్టాల్లో తనవైపు నుంచి ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకున్నారు. కానీ, రచనలోనే ఆ బలం లేదు. చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేశ్‌కి ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. ఆమె పాత్ర వల్లే అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. ప్రథమార్ధంలో వెన్నెల కిశోర్, రఘుబాబు తదితర హాస్యనటులున్నా కామెడీ పండలేదు. గెటప్ శ్రీను, తాగుబోతు రమేశ్, సత్య తదితర కామెడీ గ్యాంగ్ కాస్త పర్వాలేదనిపిస్తారు. తరుణ్ అరోరా, షవర్ అలీ ప్రధాన విలన్లుగా కనిపిస్తారు. మహతి స్వరసాగర్ పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. సినిమాకి రచనే బలహీనం. కథ, కథనాలు ఊహకు తగ్గట్టే సాగుతుంటాయి. మెహర్ రమేశ్ మేకింగ్‌లో కొత్తదనం ప్రదర్శించలేకపోయారు. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు.
కథ ఏమిటంటే..
శంకర్ (చిరంజీవి) తన సోదరి మహాలక్ష్మి (కీర్తిసురేశ్)తో కలిసి కలకత్తాలో దిగుతాడు. చదువుకోసం చెల్లెల్ని కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవర్‌గా జీవితాన్ని మొదలుపెడతాడు. మహాలక్ష్మిని చూసి శ్రీకర్ (సుశాంత్) ప్రేమలో పడతాడు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో ఉంటూనే, మానవ అక్రమరవాణాకి పాల్పడుతున్న అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) సోదరుల్లో ఒకొక్కరినీ అంతం చేయడం మొదలుపెడతాడు శంకర్. ఆ విషయాన్ని కళ్లారా చూస్తుంది శ్రీకర్ సోదరి, క్రిమినల్ లాయర్ లాస్య (తమన్నా). ఆ తర్వాత ఏం జరిగింది? మానవ అక్రమ రవాణా ముఠాతో శంకర్‌కి ఉన్న వైరం ఏమిటి? అసలు శంకర్ గతమేమిటి? మహా, శ్రీకర్ జంట పెళ్లి జరిగిందా?లేదా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాండి..