ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతను దోచుకుంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి చెప్పారు. నంద్యాల పట్టణంలోని గురువారం నిర్వహించిన ఎస్పీ వెల్లడించిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లాకు చెందిన నటరాజశేఖర్, బెంగళూరుకు చెందిన సూర్యదేవర అనిల్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన వీరచైతన్య, సనావుల్లా, పాలెం అశోక్‌కుమార్‌రెడ్డి ఒక మఠాగా ఏర్పడ్డారు.
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను ముంచేందుకు కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నారు. శిక్షణ తరగతుల పేరుతో లెటర్లు ఇస్తూ నమ్మించేవారు. ఆదాయపు పన్ను శాఖలో టాక్స్ అసిస్టెంట్, టాక్స్ ఇన్స్పెక్టర్లుగా, సచివాలయ, రైల్వేశాఖ, వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు తెరలేపారు. ఈ క్రమంలో 2021 జనవరి 29న నందికొట్కూరు పట్టణం సాయిబాబాపేటకు చెందిన ఉమాదేవి, ఆమె భర్త ఆవుల రాజుతో పరిచయం ఏర్పరచుకున్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. రాజు భార్య ఉమాదేవితో పాటు అరవింద్, నరసింహనాయుడు, సోమశేఖల నుంచి రూ.49.24 లక్షలు తీసుకున్నారు. వారికి ఇంటర్వ్యూ చేసినట్లు నమ్మించి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్లు ఇచ్చినట్లుగా నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు వాట్సాప్‌లో పంపించారు. మోసపోయినట్లు గుర్తించిన ఉమాదేవి జులై 2న నందికొట్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ విజయభాస్కర్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు నగరంలోని కొత్త బస్టాండు వద్ద ఉన్న నటరాజు, సూర్యదేవర అనిల్‌కుమార్, పాలెం అశోక్కుమార్రెడ్డిలను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న రూ.35 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు విజయవాడ, హైదరాబాద్‌లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి రిమాండుకు వెళ్లొచ్చినట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీఐ విజయభాస్కర్, ఎస్సై ఎన్వీ రమణ, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటరమణ, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.