` జోబైడెన్ తీవ్ర వ్యాఖ్యలు
` ఆ దేశ ఆర్థిక విధానాలపై ఆక్షేపణ
వాషింగ్టన్ : చైనా ఆర్థిక విధానం, తద్వారా ఎదురయ్యే సమస్యలపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధిక జనాభా, ఆర్థిక సమస్యలు చైనాను ముంచడం ఖాయమన్నారు. చైనా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్బాంబులా ఉందంటూ జోబైడెన్ వ్యాఖ్యానించారు. ఆ దేశ పరిస్థితి గురించి మిగిలిన దేశాలు కూడా ఆందోళనగా ఎదురు చూస్తున్నాయన్నారు. యూటాలోని పార్క్ సిటీలో విరాళాల సేకరణలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వృద్ధి మందగించడం, దీనికి తోడు అక్కడ పనిచేసే వారి కంటే రిటైరై పోయేవారి సంఖ్యే అధికంగా ఉండటం చైనాకు సమస్యాత్మకంగా మారిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. అక్కడ ఇప్పుడు అత్యధిక నిరుద్యోగ రేటు కొనసాగుతోంది. దీంతో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. అది ఏమాత్రం మంచిది కాదు. సాధారణంగా చెడు గుణంతో ఉన్న వారికి సమస్యలు ఎదురైతే.. వారు వాటి నుంచి బయట పడే క్రమంలో మరిన్ని చెడు పనులే చేస్తారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజింగ్ చర్యలను వాషింగ్టన్ నిశితంగా గమనిస్తోందన్నారు. ఆ దేశంతో పోరును కోరుకోవడం లేదని బైడెన్ వెల్లడిరచారు. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును ఆయన ఓ రుణ ఉచ్చుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కింద రుణం పొందాలనుకునే దేశాలు చైనా షరతులను కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుందన్నారు.
నిజానికి చైనాలతో సత్సంబంధాలు మెరుగు పర్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేశాం. కానీ అందులో విఫలమయ్యాం. ఈ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని జో బైడెన్ అన్నారు. చైనాలోని టెక్నాలజీ సంస్థల్లో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు విధిస్తూ ఈ వారం బైడెన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం చైనా వైఖరే అని పేర్కొన్నారు. ఇప్పటికే చైనా ఎగుమతులు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులను అమెరికా నిలిపివేసింది.
ఇప్పటి వరకు చైనాపై జోబైడెన్ చేసిన అత్యంత తీవ్ర వ్యాఖ్యలు ఇవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు, ఆ దేశ మోసపూరిత ఆర్థిక విధానాలపై బైడెన్ కఠిన వైఖరి తీసుకొన్నారని ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి.