బహిరంగ ప్రదేశంలో మాట్లాడుకుంటున్న స్నేహితులను పోలీసులమని బెదిరించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి ఇన్‌ఛార్జి సీఐ ఈదుల నరసింహారావు, ఎస్ఐ అసిరితాత తెలిసిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ద్వారకానగర్ ప్రాంతానికి చెందిన ఎస్.రాధాకృష్ణ ఈ నెల 3న తన స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై వేపగుంట నుంచి అడివివరం దరి భైరవవాక వైపు వెళ్లాడు.
భైరవస్వామి గుడి వద్ద బహిరంగ ప్రదేశంలో ఇరువురూ మాట్లాడుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు పోలీసు యూనిఫాం, ఆర్మీ టోపీ ధరించి వారి వద్దకు వచ్చి తాము పోలీసులమని చెప్పి చరవాణిలో యువతీ యువకుల ఫోటోలు తీశారు. కేసు నమోదు చేస్తామని బెదిరించి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారిద్దరినీ చంపేస్తామని బెదిరించడంతో పాటు యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో భయాందోళనకు గురైన రాధాకృష్ణ రూ.400 నగదు, మరో రూ.16 వేలు ఫోన్‌పే ద్వారా వారికి పంపించారు. ఆ తర్వాత నిందితులు పరారయ్యారు. జరిగిన విషయంపై రాధాకృష్ణ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ మేరకు ఎస్ఐ అసిరితాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఇలాంటి తరహా నేరాలకు పాల్పడిన వ్యక్తులపై అనుమానంతో విచారణ జరపగా ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. పెందుర్తితో పాటు గోపాలపట్నం, విజయనగరం, గంట్యాడ, విశాఖ మహిళా పోలీస్ స్టేషన్, విజయనగరం దిశ పోలీస్ స్టేషన్, తూర్పు గోదావరి జిల్లా కోరింగ ప్రాంతాల్లో 16 కేసుల్లో నిందితుడైన విజయనగరం జిల్లా ఎస్.కోట దరి మామిడిపల్లికి చెందిన ఈతలపాక శివప్రసాద్(43)ను అరెస్టు చేశారు. ఇతనితో పాటు నేరానికి పాల్పడిన అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీకి చెందిన పట్టాసి అశోక్(26)ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
వీరివద్ద నుంచి ఒక స్కూటీ, మూడు ఫోన్లు, పోలీసు దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. వీరి చేతుల్లో ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ అసిరితాత కోరారు.