` రైతన్నల సంఖ్య తగ్గితే ఇండియాకు ఇబ్బంది
` యంత్రాల వినియోగం పెంచాలి
` చిన్న, సన్నకార రైతులకు చేయూత అందించాలి
` ప్రత్నామ్నాయ రంగాల వైపు వలసలు నివారించాలి
‘‘భారతదేశం ‘వెనకబడి ఉండడానికి’ కారణం దేశంలో పెరుగుతున్న జనాభా. వ్యవసాయరంగంపై ఆధారపడిన ప్రజల సంఖ్య ఎంత తగ్గితే అంత మంచిది,’’ వంటి అభిప్రాయాలు 1960`90 మధ్య జనంలో ఉండేది. అనేక మంది నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసేవారు.
కాలక్రమేణా.. పెరుగుతున్న జనాభా ఒక్కటే భారత పేదరికానికి ముఖ్య కారణం కాదనీ, సాగురంగంలో ఎంత మంది జనం ఉన్నారనే అంశం కన్నా స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా ఎంత అనేది ప్రధానమనే భావనలు నిదానంగా మేధావుల పరిశీలనకు వచ్చాయి. కాబట్టి ఈ రెండు అభిప్రాయాలను విడివిడిగా దేశాభివృద్ధికి లేదా పేదరికానికి కారణాలుగా పరిగణించడం కాలం చెల్లిన అభిప్రాయంగా మారిపోయింది.
ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ వ్యవసాయరంగం నుంచి 4 వేలకు పైగా జనం బయటకు వెళ్లిపోతున్నారని నేషనల్ ఆగ్రి-ఫుడ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (నాబీ) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ పారీక్ ఇటీవల వెల్లడిరచారు. ‘విజన్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఇన్ ద రనప్ టూ ఇండియా’ అనే వరుస ప్రసంగాల్లో భాగంగా ఆయన ఈ కీలక సమాచారం తెలిపారు. వ్యవసాయరంగంలో కొనసాగే రైతులు, కార్మికుల సంఖ్య తగ్గితే మంచిదనే అభిప్రాయంతో ఆయన విభేదించారు. ఒకప్పుడు దేశ జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవించేవారు. ఈ ఆరు దశాబ్దాల కాలంలో వారి సంఖ్య 45 -50 శాతానికి తగ్గిందని అనేక సంస్థల గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీలో వ్యవసాయరంగం వాటా 18.3 శాతానికి వచ్చిందని నిపుణుల అంచనా. అంటే.. అంత మంది ప్రజలు పని చేస్తున్నప్పుడు వ్యవసాయరంగం వాటా ఇంత తక్కువ ఉందంటే ఇంకా ప్రజలు గణనీయ సంఖ్యలో వ్యవసాయం నుంచి బయటకు వచ్చి, ఇతర రంగాల్లో జీవనోపాధి అన్వేషించడం మంచిదని వాదించేవారు కూడా గణనీయంగా ఉన్నారు. అయితే, ఇండియాలో ఉన్న మొత్తం పరిస్థితుల దృష్ట్యా దేశంలో వ్యవసాయరంగం నుంచి ఇంకా జనం ఇతర రంగాలకు తరలిపోవడం, ఇక ఆగిపోవడం మంచిదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చిన్న కమతాలు తగ్గకుండా, యంత్రాల వినియోగం పెరగకుండా ఉంటే….
చిన్న కమతాలు ఎక్కువ ఉన్న దేశం మనది. అలాగే, వ్యవసాయంలో ట్రాక్టర్లు, కోత–నూర్పిడి వంటి పనులు చేసే యంత్రాల వినియోగం కూడా దేశవ్యాప్తంగా బాగా విస్తరించలేదు. ఈ రెండు కారణాల వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో కొనసాగాల్సిన ప్రజల సంఖ్య తగ్గడం వాంఛనీయ పరిణామం కాదు. వ్యవసాయదారుల సంఖ్య బాగా తగ్గిపోవాలి అని ఎవరైనా అంటున్నారంటే వారు ‘వ్యవసాయం దండగ’ అనే మాటలకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టే లెక్క. ఇండియాలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువ. రెండు హెక్టార్ల కంటే తక్కువ పొలంలో వ్యవసాయం చేసే రైతుల సంఖ్య 86.2 శాతం ఉంది. అయితే, 2 నుంచి పది హెక్టార్ల భూమిలో వ్యవసాయం చేసే రైతుల సంఖ్య మొత్తం సాగుదారుల్లో 13.2 శాతమే. కానీ, వారి యాజమాన్యలోని సాగుభూమి విస్తీర్ణం 47.3 శాతమేనని కొన్నేళ్ల క్రితం విడుల చేసిన వ్యవసాయ సెన్సస్ వెల్లడిరచింది. దీన్నిబట్టి భారీ సంస్కరణలు లేని ఈ రంగంలో మొత్తం మీద చిన్న సాగు కమతాలు ఉన్న కారణంగా, యాంత్రీకరణ విస్తరించని పరిస్థితుల్లో వ్యవసాయ రంగం నుంచి ప్రజలు ఇతర రంగాలకు వలసపోవడం దేశానికి, ఆహార భద్రతకు మంచిది కాదని డా.అశ్వనీ పారీక్ వంటి వ్యవసాయరంగ నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయంలో తమకు ఇక భవిష్యత్తు లేదని రైతులు ఇతర రంగాలకు తరలిపోవడం మంచి పరిణామం కాదనే అభిప్రాయానికే ఎక్కువ మంది వెలిబుచ్చుతున్నారు. వ్యవసాయంలో అన్ని విధాలా పెట్టుబడులు పెరిగేలా ప్రభుత్వాలు చర్యలు కొనసాగించాలి. ఇంకా చిన్న కమతాలు అయినప్పటికీ ఎక్కువ ఆదాయం, దిగుబడి అందించే పంటలు పండిస్తే అన్ని ప్రాంతాల్లో, పరిస్థితుల్లో వ్యవసాయం ఇతర లాభసాటి వ్యాపారాలతో పోటీపడే స్థాయికి చేరుకుంటుంది. ఈ లెక్కన వ్యవసాయరంగం నుంచి రైతులు ఇతర రంగాలకు వలసపోవడం ఆర్థికవ్యవస్థకు శుభ పరిణామం కాదనే అనుకోవాలి.
` వి.విజయసాయిరెడ్డి
(రాజ్యసభ సభ్యులు)