.విరుచుకుపడిన విపక్షాలు
.ప్రసంగంలో మొదటి 90 నిమిషాలు ‘మణిపూర్’ ఊసే లేదన్న టీఎంసీ ఎంపీ
.‘ఇండియా’ విజయంపై మరింత నమ్మకం కుదిరింది
.మోడీ ‘కాంగ్రెస్ ఫోబియా’తో బాధపడుతున్నారు : ఎంపీ గౌరవ్ గొగోయ్
ఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 11 : మణిపూర్ హింసపై మాట్లాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నోరే రాలేదని విపక్షాలు మండిపడ్డాయి. అవిశ్వాస తీర్మానంపై మోడీ ప్రతిస్పందనను తప్పుబట్టాయి. 90 నిమిషాల పాటు మోడీ మణిపూర్ ఊసే ఎత్తలేదని, తాము సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత మాత్రమే ఆయన మాట్లాడారని దుమ్మెత్తిపోశాయి. ఈ మేరకు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మోడీ తన ప్రసంగంలో తొలి 90 నిమిషాలు ‘మణిపూర్’ పేరే ఎత్తలేదని, చివరికి తాము సభను వాకౌట్ చేసిన తర్వాత మాత్రమే ఆయన మణిపూర్ గురించి మాట్లాడారని విమర్శించారు.
మీరేసుకున్న టెఫ్లాన్ పూతపోయింది. మెరుపు మాయమైంది. ఈ రోజు మీ ప్రసంగం తర్వాత భారత్‌ను ‘ఇండియా’ గెలుస్తుందన్న నమ్మకం కలిగింది అని ఆయన పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల మొత్తం ప్రధాని మోడీ రాజ్యసభకు డుమ్మా కొట్టారని ఒబ్రెయిన్ విమర్శించారు. మణిపూర్‌పై లోక్‌సభలో ఆయన నాలుగంటే నాలుగే నిమిషాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. అది కూడా ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప ఆయన మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి మించి మరెవరూ పార్లమెంటును ఇంతగా అవమానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కూడా మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. మోదీ తన ప్రసంగం మొత్తాన్ని కాంగ్రెస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఆయనకు ‘కాంగ్రెస్ ఫోబియా’ పట్టుకుందని ఎద్దేవా చేశారు. మోడీ రెండు గంటలు మాట్లాడితే అందులో చాలావరకు సమయాన్ని మణిపూర్ గురించి కాకుండా కాంగ్రెస్‌ను తిట్టడానికే వినియోగించుకున్నారని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు.