. చంద్రయాన్ కంటే 2 రోజుల ముందే జాబిల్లిపై ల్యాండిరగ్
. దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ‘లూనా-25’ ప్రయోగం
. శుక్రవారం తెల్లవారుజామున 2.00గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగికెగసిన రాకెట్
. ఆగస్టు 21న చంద్రుడిపై దిగే అవకాశం
మాస్కో : దాదాపు అర్ధశతాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా వెలుగొందిన రష్యా మరోసారి తన సత్తా ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు చంద్రయాన్ తరహాలో తాజాగా ‘లూనా-25’ వ్యోమనౌకను ప్రయోగించింది. రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25ను తీసుకుని వెళుతున్న రాకెట్ నిప్పులు కక్కుతూ నింగికెగసింది.
రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మొనాస్ ప్రకటన ప్రకారం.. మరో ఐదు రోజుల్లో ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యను చేరుకుంటుంది. అనంతరం, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు అన్వేషించిన అనంతరం చంద్రుడిపై దిగుతుంది. ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మొనాస్ నిపుణుల పేర్కొన్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాది పాటు ఈ వ్యోమనౌక చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతుంది.
ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ‘చంద్రయాన్-3’ ద్వారా సాఫ్ట్ ల్యాండిరగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు ‘లునా-25’ ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడే అడుగుపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, చంద్రయాన్-3 మాదిరి కాకుండా ఇది కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. కేవలం 30 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. అనేక దీర్ఘకాలిక పరిశోధనలు కూడా చేపడుతుందని రష్యా అంతరిక్ష సంస్థ పేర్కొంది. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
రష్యా అంతరిక్ష రంగానికి కొత్త ఊపు ఇవ్వడంతో పాటూ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒంటరవుతున్న దేశంలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయోగం జరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
చంద్రయాన్-3కి ఏమైనా ఇబ్బందా?
ఇక ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కూడా జాబిల్లి వైపు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇస్రో ప్రణాళిక ప్రకారం చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. ఇప్పుడు రష్యా లూనా ప్రయోగంతో చంద్రయాన్‌కు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అన్న సందేహాన్ని ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు. దీనికి రష్యా శాస్త్రవేత్తలు మాతర్ర అటువంటిది ఏమీ ఉండదనే చెబుతున్నారు.
జాబిల్లి దక్షిణ ధ్రువంలో గణనీయ పరిమాణంలో మంచు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ల్యాండిరగ్ సవ్యంగా జరిగితే ఆక్సిజన్, ఇంధనం, నీరు వంటి వనరులపై సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కంటే ముందే లూనా-25 ల్యాండర్ దిగితే అక్కడ అడుగుపెట్టిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. అయితే చంద్రయాన్-3, లూనా-25 రెండూ దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయితే అవి ఢీకొనే ప్రమాదం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రష్యా స్పష్టతనిచ్చింది. ఈ రెండు అంతరిక్ష సంస్థలు ల్యాండిరగ్ చేయాలనుకున్న ప్రాంతాలు వేర్వేరని పేర్కొంది. అందువల్ల అవి ఢీకొనే ప్రమాదం లేదని వెల్లడిరచింది.
ఇక, చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్స్ ఉన్నాయి. గతంలో చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్ ఇంకా కక్ష్యలో తిరుగుతోంది. చంద్రయాన్-3కి కూడా అదే ఆర్బిటర్‌ను వినియోగించుకోనున్నారు. ఇక, చంద్రయాన్-3 పంపే ల్యాండర్ జాబిల్లిపై 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. రష్యా పంపే లూనా-25 ఏడాదిపాటు జాబిల్లి ఉపరితలంపై పనిచేయనుంది.
ఇస్రో అభినందనలు
లూనా-25ని విజయవంతంగా ప్రయోగించడంపై రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌కు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అభినందనలు తెలియజేసింది. ‘ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో మీటింగ్ పాయింట్ ఉండటం అద్భుతం.’ అని ట్విటర్లో పేర్కొంది. చంద్రయాన్-3, లూనా-25 మిషన్లు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించింది.