విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 10: విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల (ఆంధ్ర వైద్య కళాశాల అనుబంధం)లో చదువుకున్న డాక్టర్ ఎస్.చందన అత్యద్భుతమైన ప్రతిభ కనబర్చారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన పీజీ పరీక్షల్లో ఆమె 458మార్కులు సాధించి అందరితోనూ శెభాష్ అనిపించుకున్నారు. మరో విశేషమేంటంటే ఎండీ సైకియాట్రీ విభాగంలో ఏపీలోనే ఆమె ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేవీ రామిరెడ్డి, మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ డి. విజయలక్ష్మి తదితరులు చందనకు అభినందనలు తెలిపారు. తమ విద్యార్థులు ఇలా ప్రథమ స్థానంలో నిలవడం ఇది మూడోసారి అని, భవిష్యత్తులోనూ మంచి శిక్షణ అందిస్తూ తమ సంస్థ మంచి పేరు తెచ్చుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పలువురు వైద్యులు, అధ్యాపక బృందం కూడా డాక్టర్ ఎస్. చందనను అభినందించారు.