తన ప్రేమకు అడ్డువస్తాడని తండ్రిని చితక్కొట్టించి కాళ్లు విరగొట్టించిందో కుమార్తె. మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లా మధ తాలుకాకు చెందిన మహేంద్ర షా..పేరుమోసిన వ్యాపారవేత్త. ఆయన కుమార్తె సాక్షి. ఆమె చైతన్య అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకునేందుకు.. మహేంద్ర కాళ్లు విరగ్గొట్టాలని పన్నాగం పన్నారు.
నలుగురు వ్యక్తులకు రూ.60 వేల సుపారీ ఇచ్చారు. పథకంలో భాగంగానే పుణెకు వెళ్లిన సాక్షి.. ఆదివారం రాత్రి తిరిగి మధకు వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి తండ్రిని రమ్మని ఫోన్ చేసింది. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లేందుకు మహేంద్ర కారులో వచ్చారు. తిరిగి వెళుతుండగా.. వాడచివాడి గ్రామ సమీపంలో మూత్రం వస్తోందని సాక్షి కారును ఆపింది. ఆ వెంటనే రెండు బైక్‌లపై కారును అనుసరిస్తున్న నలుగురు వ్యక్తులు మహేంద్రపై దాడి చేశారు.
దారుణంగా కొట్టి.. ఆయన రెండు కాళ్లు విరగొట్టారు. పదునైన ఆయుధంతో తలపై పొడిచి పారిపోయారు. మహేంద్ర అరుపులు విన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి కుమార్తెను ప్రధాన నిందితురాలిగా తేల్చారు. కుట్రలో ఆమె ప్రియుడి హస్తాన్ని నిర్ధరించారు. వీరిద్దరితో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.