హైకోర్టుకు తెలిపిన ఏఏజీ అంగళ్లు ఘటనలో దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిపై కేసు పెట్టిన పోలీసులు ` ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన నేతలు ` తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా
విజయవాడ, న్యూస్‌లీడర్, ఆగస్టు 11 : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్కుమార్రెడ్డిలకు సోమవారం వరకు ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. అంగళ్లు ఘటనకు సంబంధించి దేవినేని ఉమ, నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డిలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ కోరుతూ వీరిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. అయితే వివరాలు అందించేందుకు తమకు సోమవారం వరకు సమయం కావాలని ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో వారిని సోమవారం దాకా అరెస్టు చేయబోమని కోర్టుకు అదనపు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.