తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు.
రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకుంటారనగా.. ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. కుటుంబసభ్యులు భయంతో కేకలు వేయడంతో అడవిలోకి ఈడ్చుకెళ్లింది. దీంతో పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలు పడలేదు.
ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక మృతదేహాన్ని చిరుత సగం తినేసినట్లు గుర్తించారు. బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం. కాగా, గతంలోనూ కాలినడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే.