నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ల సరసన నటించే అవకాశం అందుకుంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్ అయిన మహానటి సినిమాలో నటించి.. జాతీయ అవార్డును అందుకుంది. అందరికి సావిత్రమ్మ అయిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కీర్తికి తిరుగులేదు అనుకున్నారు అంతా.. కానీ, ఏ ముహూర్తాన అమ్మడు మహానటి చేసిందో .. ఆ తరువాత నుంచి ఒక హిట్ కూడా అందుకోలేకపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి చేతులు కాల్చుకుంది.
బొద్దుగా ముద్దుగా ఉన్న బాడీని బక్కచిక్కిపోయేలా చేసి ముఖంలో కళను పోగొట్టుకుంది. ఇక ఆ తరువాత రజినీకాంత్ కు చెల్లెలిగా నటించి మరింత తప్పు చేసింది. పెద్దన్న సినిమాలో రజినీకి చెల్లెలిగా నటించింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో చెల్లెలిగా చేస్తే.. అలాంటి పాత్రలే వస్తాయి అని తెలిసి కూడా ఆమె ఆ పాత్రను చేసింది. అనుకున్నట్టుగానే ఆ తరువాత చిరుకు చెల్లెలి పాత్ర అంటూ భోళా శంకర్ వచ్చింది. సరే అప్పుడంటే.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వర్క్ అవుట్ కాలేదు.. రజినీ సినిమా కాబట్టి పేరు వస్తుంది అని అనుకోని ఉండొచ్చు. కానీ, భోళాకు ముందు కీర్తికి సర్కారు వారి పాట తో కమర్షియల్ హిట్ దక్కింది. అయినా కూడా ఆమె చిరుకు చెల్లెలిగా నటించి తప్పు చేసిందని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ పాత్రను కీర్తి ఒప్పుకోకుండా ఉండాల్సింది అని అంటున్నారు. సినిమాలో చిరు- కీర్తి మధ్య సిస్టర్- బ్రదర్ సెంటిమెంట్ ఎంత బాగా పండినా.. హిట్ టాక్ లేదు కాబట్టి దీనివలన అమ్మడి కెరీర్ చిక్కులో పడినట్లే అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. కీర్తి లో నటన అభిమానులు అందరు చూసిందే. మహానటి, వెన్నెల, చిన్ని లాంటి పాత్రలను అవలీలగా చేయగల కీర్తి.. ఇకనుంచి అయినా ఇలాంటి రొటీన్ సినిమాలు చేయకుండా ఉంటే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు. మరి కీర్తి ముందు ముందు ఎలాంటి కథలను ఎంచుకుంటుందో చూడాలి.