` గ్రూప్`2 పరీక్ష వాయిదా కోరుతూ అఖిలపక్షం పిలుపు నేపథ్యంలో చర్యలు
హైదరాబాద్, న్యూస్‌లీడర్, ఆగస్టు 12 : రాష్ట్రంలో ఈ నెలాఖరున జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ శనివారం గన్ పార్క్ వద్ద మౌనదీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు విపక్ష, ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులను పోలీసులు హౌస్ అరెస్టు లు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు ఓయూ విద్యార్థులను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం తప్పులు చేస్తూ నిరుద్యోగులు, విద్యార్థులపై రుద్దడం సరికాదని హితవు పలికారు. ఒకేసారి మూడు రకాల పోటీ పరీక్షలు నిర్వహించడం అసంబద్ధమన్నారు. దీనివల్ల ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. నెల రోజుల పాటు గ్రూపు-2 పరీక్షను వాయిదా వేస్తే నష్టమేమీ లేదు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అన్యాయం అన్నారు.