ఎంపీ ఎంవీవీపై జనసేన అధినేత ఫైర్
విశాఖను వైసీపీ నేతలు అడ్డగోలుగా దోచేస్తున్నారు
కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది..గుర్తుపెట్టుకోండి..
సీఎం జగన్కు పవన్ హెచ్చరిక
ఉత్తరాంధ్ర విద్యార్థులు గళమెత్తాలని పిలుపు
సిరిపురంలో సీబీసీఎన్సీ భూములు, విశాఖ వైసీపీ ఎంపీ నిర్మించే భవనాలను పరిశీలన
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 12: వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. వారాహి యాత్రలో భాగంగా మూడో రోజు శనివారం ఆయన విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిపురంలోని సీబీసీఎన్సీ భూములు, విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించే భవనాలను పవన్ పరిశీలించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ విశాఖలో వైసీపీ నేతల భూ కబ్జాలు విపరీతంగా పెరిగాయన్నారు. చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, ఇక్కడి నుంచి పారిపోతామని చెప్పడం విశాఖ ఎంపీకి తగదన్నారు. ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని ఎంపీ చెప్పడం సిగ్గుచేటు, విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంవీవీ ఎంపీ అయ్యారన్నారు. సింహాచలం భూములు, చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారు, ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ నేతలు చెడగొట్టేస్తున్నారన్నారు. హైదరాబాద్లో కూడా ఈ వర్గమంతా ఇలానే దోపిడీ చేస్తే అక్కడనుంచి తరిమేశారు. ఇదే తరహాలో దోపిడీ కొనసాగితే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డులా అవుతుందన్నారు. విశాఖ ప్రజలు ఆలోచించుకోవాలి, ఉత్తరాంధ్ర యువత, ఏయూ వర్సిటీ విద్యార్థులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ కోసం ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు పోరాడిన విధంగానే మీరూ పోరాడాలన్నారు. ఐఏఎస్, ఏపీఎస్ అధికారులు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు, మీరు ప్రజల ఆస్తులను కాపాడాలన్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడొద్దు, ఇది నా విన్నపమని పేర్కొన్నారు. విశాఖకు సంబంధించిన అన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, దేశ భద్రతకు చాలా కీలకమైనది విశాఖ నగరమన్నారు. సీఎం జగన్కు కూడా చెబుతున్నా, మీరు ఎన్ని అక్రమాలు చేశారో, ఏ విధంగా ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్నారో..ఎలాగైతే స్థలాలను కబ్జా చేస్తున్నారో.. అన్నింటినీ బయటకు తీసుకొస్తామన్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన వెంటనే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది..గుర్తుపెట్టుకోండి.. ఇదే మీకు హెచ్చరిక’’ అని పవన్ తెలిపారు. తనలాంటి వారు బయటకు వస్తే ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని, తాను ప్రజలకు అభివాదం చేయవద్దు.. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయవద్దు.. ఇవేం ఆంక్షలు? అని పవన్ ప్రశ్నించారు.