పెందుర్తి, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: విశాఖలో ఓ వృద్ధురాల్ని వలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందనే లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ సమయంలో వృద్ధురాలి కుటుంబానికి జనసేన నేతలు అండగా నిలిచారని గుర్తు చేశారు. వారాహి విజయ యాత్ర`3లో భాగంగా పవన్ విశాఖలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పెందుర్తిలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని ఆయన శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వృద్ధురాలిని వలంటీర్ హత్య చేయడం దురదృష్టకరం. ప్రతి కుటుంబం పిల్లలు, మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో మహిళల మిస్సింగ్‌పై చెప్పిన గణాంకాలు నేను చెప్పినవి కావు. పరిశోధన సంస్థలు చెప్పిన గణాంకాల్నే నేను ప్రస్తావించాను. అలానే రౌడీషీటర్‌కు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది? కిడ్నాప్‌కు గురైన అదే ఎంపీ రౌడీషీటర్‌కు వత్తాసు పలికేలా చర్యలు ఉండటమేంటి? నాపై ఆంక్షలు పెడుతున్నారు, కానీ నేరగాళ్లకు ఎలాంటి ఆంక్షలు లేవు’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.