తిరుమల, న్యూస్లీడర్, ఆగస్టు 14: తిరుమల నడకమార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు సిబ్బంది ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు బోన్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా, తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం కాలినడక మార్గంలో తిరుమలకు వెళుతుండగా అకస్మాత్తుగా చిరుత బాలికపై దాడి చేసింది. తల్లిదండ్రుల కంటే ముందు వెళుతున్న బాలికపై రాత్రి వేళ దాడి చేసిన చిరుత ఆ తరువాత పొదల్లోకి చిన్నారిని ఈడ్చుకెళ్లి చంపి తినేసింది. మరుసటి రోజు ఉదయం బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగడంతో తిరుమల అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత మెట్లమార్గంలో చిన్నారులను అనుమతించకూడదని, వంద మంది భక్తుల చొప్పున ఓ బృందంగా భద్రత ఏర్పాట్ల నడుమ కాలినడక మార్గంలో అనుమతించాలని నిర్ణయించారు.
చిరుతను ఎస్వీ జూ పార్కుకు తరలిస్తాం: తితిదే ఈవో
బోనులో పట్టుబడ్డ చిరుతను తిరుపతి ఎస్వీ జూ పార్కుకు తరలిస్తామని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. బోనులో చిక్కే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడిరదని చెప్పారు. ఎస్వీ జూ పార్కులో చిరుతకు చికిత్స అందిస్తామని తెలిపారు. పట్టుబడిన చిరుతను ఎక్కడ వదలాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
అలిపిరి మార్గంలో మరో 3 చిరుతలు..
బోనుకి చిక్కింది లక్షితపై దాడి చేసిన చిరుతా? కాదా? అన్నదానిపై ఆరా తీస్తున్నారు. శేషాచలంలో 20 చిరుతలు ఉన్నట్టు అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ అలిపిరి నడక మార్గానికి చిరుతలు ఎందుకు వస్తున్నాయనే దానిపై సమీక్ష చేస్తున్నారు. చిరుతల సంచారం అంచనా వేసేందుకు 500 కెమెరా ట్రాప్స్ పెట్టాలని నిర్ణయించారు. 7వ మైలు దగ్గర ఇకపై 24/7 మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన చిరుతల నుంచి రక్షణకు అధికారులు చర్యలు చేపడతామంటున్నారు. మరికొద్ది రోజులు ఈ బోన్లు ఉంచి చిరుతల ట్రాప్కి ప్రయత్నాలు చేస్తామంటున్నారు ఈరోజు బోనులో చిక్కిన చిరుత చాలా ఎగ్రసివ్గా చాలా పెద్దదిగా ఉంది, ఇది ఆడ చిరుతగా చెప్తున్నారు. దాడి చేసింది ఇదేనా లేదంటే మరొకటా అనేది తేల్చేందుకు ఇంకొన్ని రోజులు బోన్లు కంటిన్యూ చేస్తామంటున్నారు.