డోన్ మండలం జగదూర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిద్ర మాత్రలు తీసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సురేశ్‌కు, కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామానికి చెందిన ముని, లక్ష్మిదేవిల కుమార్తె మేఘనకు 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
కొద్దిరోజుల నుంచి భర్త తాగుడుకు బానిసై ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చరవాణిలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ నిద్రమాత్రలు మింగింది. ఆ వీడియోను తన తల్లిదండ్రులకు పంపింది. వారు వచ్చి మేఘన కోసం వెతకగా ఆమె కనిపించలేదు. మేఘన ఇంట్లో నుంచి వెళ్లిపోయి, కర్నూలు బస్సు ఎక్కగా ఆమె పరిస్థితి చూసి స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఆదివారం తల్లి లక్ష్మిదేవి డోన్ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో సురేశ్‌పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మేఘన చికిత్స పొందుతున్నట్లు గ్రామీణ ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపారు.