చిలకలూరిపేట గ్రామీణం, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: చిలకలూరిపేట గ్రామీణం: ఆ అన్నదమ్ముల ఎదుగుదలను చూసి విధికి కన్నుకుట్టిందేమో! రోడ్డు ప్రమాదం ఇద్దరినీ బలిగొంది. కష్టపడి చదివి జీవితాల్లో స్థిరపడిన సోదరులను ఒక్కసారిగా ఈలోకం నుంచి దూరం చేసి కన్నవారికి పుత్రశోకాన్ని మిగిల్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన కుమారులిద్దరూ ఊహించని ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన మోపూరి చెన్నకృష్ణారావు, గోవిందమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారులు రమేశ్ (31), బాలకృష్ణ (29)లను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించారు. రమేశ్ సీఆర్పీఎఫ్లో.. బాలకృష్ణ రైల్వే గేటు కీపర్‌గా పనిచేస్తున్నారు. రమేశ్ విశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం తన సోదరుడు విశాఖ వెళ్తుండటంతో రైలు ఎక్కించేందుకు ఆయన్ను తీసుకుని బాలకృష్ణ ద్విచక్ర వాహనంపై కట్టుబడివారిపాలెం నుంచి బయల్దేరారు.
మార్గంమధ్యలో యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద హైవేపై మరమ్మతుల దృష్ట్యా ప్రమాదాల నివారణకు రోడ్డుపై పెట్టిన వేగనిరోధకాల వద్ద బాలకృష్ణ బైక్‌ను నెమ్మదిగా నడిపారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్‌ను ఢీకొట్టి అన్నదమ్ములు ఇద్దరి పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రమేశ్, బాలకృష్ణ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను యడ్లపాడు పోలీసులు చిలకలూరిపేట మార్చురీకి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన ఇద్దరు కుమారుల మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. రమేశ్‌కు భార్య, 6 నెలల పాప ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.