ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రంగా, మరో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విశాఖ నగర పరిధి జీవీఎంసీ 88వ వార్డు వెదుళ్లనరవ సమీపంలోని అల్లిమెట్ట మలుపు వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సబ్బవరం సీఐ పి.రంగనాథం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కొంతమంది దువ్వాడలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వారి స్వగ్రామానికి ఆటోలో వస్తుండగా చోడవరం నుంచి గాజువాక వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వర్రి గోపాలం, అల్లు సూరిసత్యంకు తీవ్రగాయాలయ్యాయి. చల్లా శ్రీను, వేమలి కృష్ణమ్మ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పి.రంగనాథం తెలిపారు.