చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ప్రధాన తపాలా కార్యాలయం ప్రాంతానికి చెందిన సుద్ధాబత్తుల కృష్ణ సెంట్రింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
మూడో తరగతి చదువుతున్న అతడి కుమార్తె సత్యశ్రీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆరుబయట ఆడుకుంటోంది. అటుగా వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి చిన్నారికి తినుబండారాలు కొనిపెడతానని చెప్పి ఎత్తుకున్నాడు. అది గమనించిన ఆమె తండ్రి కృష్ణ గట్టిగా అరవడంతో.. చిన్నారిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.
వెంబడించిన కుటుంబ సభ్యులు స్థానిక పాతబస్టాండ్ సమీపంలో అతడిని పట్టుకుని ఓ చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తి పట్టణంలోని ఓ లాడ్జి కాపలాదారు మరీదు సాయి అని పలువురు చెబుతున్నారు.