ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్నాం. ఘనతకెక్కిన పాలకులు ‘ఈ ఉత్సవాలను ఆదర్శవంతంగా, జాతీయ స్ఫూర్తితో చేసుకుందాం’ అంటూ ఎప్పటిలాగే పిలుపునిచ్చారు. కానీ, దేశంలో పరిస్థితి ప్రశాంతంగా వేడుకలు చేసుకునేలా ఉందా? ఆ అవకాశాన్ని మనకు పాలకులు కల్పిస్తున్నారా? మణిపూర్ మండుతున్న వైనాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె బాధలో రగిలిపోతోంది. అనాగరిక చేష్టలు, ఆటవిక దాడులు, ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో ఆ రాష్ట్ర ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న దుర్భర స్థితి. హింస జడలు విప్పి కరాళనృత్యం చేస్తోంది. తల్లి ముందే కొడుకును చంపడం, అమానవీయంగా.. అమానుషంగా మహిళల మానప్రాణాలు చెరబట్టడం, ఒక వర్గం ఇళ్లకు వేరే తెగల వారు వచ్చి నిప్పు అంటించడం .. దయనీయ పరిస్థితి.
నేతలు వచ్చారు.. వెళ్లారు.. పరామర్శలు.. మేం ఉన్నామంటూ ప్రకటనలు.. భరోసాలు.. కొందరు ప్రజాప్రతినిధులు ఆ పని కూడా చేయడానికి ఇష్ట పడలేదు. చట్టసభల్లో కూర్చొని చర్చిస్తారంటే.. అదీ లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు.. చివరకు సమస్య మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ చందమైంది. మణిపూర్వాసులు ‘మా రాష్ట్రంలో శాంతి నెలకొల్పండి’ అంటూ గావు కేకలు పెడుతూనే ఉన్నారు. వారి అరుపులను, అభ్యర్థనలను పట్టించుకునే సమయం కూడా మన నేతలకు లేకుండా పోయింది.
మరి మన 77 ఏళ్ల స్వాతంత్య్రం ఏమిచ్చినట్టు? ఏం నేర్పినట్టు? మూడు మాసాల నుంచి దేశాన్ని కుదిపేస్తున్న ఒక ప్రధాన సమస్య పరిష్కరించుకునే స్థితిలో కూడా లేమా మనం? అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. పాలకులు ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించి సమస్యగానే చూస్తున్నారు. అంతకుమించి సమస్యను రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే ఎన్ని స్వాతంత్య్ర సంబరాలు జరుపుకొంటే ఏం ప్రయోజనం? ఎంతో అభివృద్ధి సాధించాం అని ఎలుగెత్తి చాటుకుంటే ఏం లాభం??